గురువులు పలురకాలు-వాళ్ళు వేసే శిక్షలు-దండనలు వివిధ రకాలు!!!

బెత్తంతో కొట్టేవాళ్ళు కొందరు!

గోడకుర్చీ వేయించేవాళ్ళు కొందరు!

పాఠశాలలో ఆడుకునే స్థలవలయం చుట్టూ తిరగమనేవాళ్ళు కొందరు!

గుంజీళ్ళు తీయమనేవాళ్ళు కొందరు!

తరగతి గది బయట నిలబడమని చెప్పేవాళ్ళు కొందరు!

తొడపాశం పెట్టేవాళ్ళు కొందరు!

ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నానో కనిపెట్టి ఉంటారు ఈపాటికి!

తొడపాశం గురించి!!!

దీనికి కావలసిన వస్తువులు-పదార్ధాలు-రెండే రెండు!!

అవతలవాళ్ళ తొడ, మనచేయి-ఏదో ఊహించేసుకుని అపార్థం చేసుకోకండి పూర్తిగా నేను రాసేది చదవండి!

చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాఠశాలలో పిల్లకాయలు (పిల్లకాయలు కాక పెద్దకాయలు ఉంటారా అని అనబోకండి)అల్లరి చేసినా,చెప్పిన పాఠం విని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా,కొంతమంది గురువులు దండించే విధానంలో ఇదికూడా ఒకటి.

మన తొడమీద ఆయన చేతితో మెలిపెట్టి తిప్పేవాళ్ళు, చచ్చేంత నెప్పిపుట్టి చచ్చేది,చర్మం ఎఱ్ఱగా కందిపోయేది కూడా.

ఇక్కడ కొంతమంది గురువులు ఏ కారణంచేతనో వాళ్ళు దగ్గరకు రాకుండా వేరే బెంచ్ వాళ్ళతో తొడపాశం పెట్టించేవాళ్ళు-మన బెంచిలో కూర్చునేది మన స్నేహితులేగా-తొడపాశం మెల్లిగా పెడతారు అందుకని.ఇక “ప్రశ్నలపర్వం” ఉన్న క్లాసులో ఇంకొంతమంది గురువులు- జవాబు చెప్పినవాళ్ళచేత చెప్పనివాళ్ళకి తొడపాశం పెట్టించేవారు.

ఏ ఆడపిల్లో జవాబు చెప్పిందనుకోండి, చచ్చామే!! చిన్నపిల్లలం కదా సిగ్గు అభిమానం, అవమానం ఉండేది కూడా.ఇంటికి వెళ్లి ఉడుక్కొని ఏడ్చి చచ్చేవాళ్ళం కూడా.కొంతమంది “వెధవాయలు” మాత్రం నవ్వుతూ ఆనందంగా తొడపాశం పెట్టించుకునేవాళ్ళు ఆడపిల్లల చేత! ఇంకొందరు “ముదురు వెధవాయలు” కావాలనే జవాబులు తప్పు చెప్పేవారు- ఆడపిల్లలల చేత తొడపాశం పెట్టించుకోవడానికి అవకాశం రావచ్చుకదా అని!

పెద్దయిన తర్వాత అర్ధం అయింది వాళ్ళు ముదుర్లు,మనమే వెధవాయలం, అమాయకులం అని.

ఆడపిల్లలు మాత్రం సిగ్గుపడేవాళ్ళు!!!

ఏ గురువులు ఈ కోవకి చెందుతారో తెలుసుకాబట్టి ఆరోజు గుర్తుంటే గట్టిగా, బండగా ఉన్న లాగూ వేసుకొని పాఠశాలకి వెళ్లేవాళ్లం-“శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు” ఉండనే ఉన్నాయిగా మరి.సమాధానాలు చెప్పే తెలివిలేకున్నా

వీటికేమీ తక్కువా లేదు,లోటూ లేదు.ఈ చావు తెలివితేటలు పెద్దయిన తర్వాత అప్పుడప్పుడు ఉపయోగపడ్డాయి అనుకోండి- ఉద్యోగాల్లో.

వెనకటికి ఎవడో అన్నట్టు “జానెడు పొట్టకోసం బారెడు కష్టాలు పడాలి జీవితంలో” అని- పొట్ట జానెడయినా, బెత్తెడయినా కష్టాలు మాత్రం బోల్డన్ని బారెడ్లు ఉండేవి అనుకోండి.కానైతే కష్టం వచ్చినప్పుడల్లా “కష్టాలు మనుషులకి కాక మానులకు వస్తాయా” అని అనుకుని బండి లాగించేసా అనుకోండి- పెద్ద గొప్ప, నేనేమిటి- మీరూ అంతేగా!

నాఅంచనా ప్రకారం1975- 80లోపు పుట్టినవాళ్ళకి ఈఅనుభవం- తొడపాశం- ఉండితీరాలి, కాదంటే నమ్మను.ఆ తర్వాత పుట్టినవాళ్ళకి కూడా ఈ అనుభవంఉంటే చక్కగా,బుద్ధిగా చదివినట్టు అర్ధం;తొడపాశం పెట్టించుకున్నంత మాత్రాన తెలివిలేదు అనడం ఏమి తెలివి?

ఈ అనుభవం ఉన్నవాళ్ళు-“పెట్టినవాళ్ళు పెట్టించుకున్నవాళ్ళు” (సాధారణంగా ఈ రెండు అవకాశాలు అందరికి కొన్నిసార్లయినా వస్తాయి) సిగ్గు పడకుండా నాకు చెప్పండి-నేను ఎవరికీ చెప్పనుగా!!!

ఒట్టు-అమ్మ తోడు!!!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!